రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటికి వంద రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 5 హామీలను అమలు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తెలిపింది. గతేడాది డిసెంబరు 7న పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కారు నేటితో 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ‘100 రోజుల ప్రగతి నివేదిక’ను ప్రభుత్వం విడుదల చేసింది.
అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన ప్రభుత్వం ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. మరికొద్ది రోజుల తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగానే రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేసింది. గృహజ్యోతి పథకం కింద అర్హులైన పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ వినియోగానికి జీరో బిల్లులు జారీ చేస్తోంది. ఇక ఇటీవలే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.