హే..మిటి ఈ కాంగ్రెస్ ..? కారుని మించిన స్పీడు ?

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయకులు అకస్మాత్తుగా గొంతు పెంచారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపిస్తూ, హడావుడి చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న కీలక నాయకులు అంతా ఇప్పుడు టిఆర్ఎస్ ను ఎండగట్టడమే పనిగా పెట్టుకుని ముందుకు కదులుతున్నారు. ఇప్పటివరకు తమలో తామే తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నట్టు గా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్లు అంతా టిఆర్ఎస్ పై యుద్ధం పకటించినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకపక్క తెలంగాణలో బిజెపి బలపడి పోతుండడం,  కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించి పాతుకు పోయేందుకు ప్రయత్నించడం, అలాగే కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండడం, ఇవన్నీ కాంగ్రెస్ నేతల్లో కలవరం పుట్టిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి.
 ఇక తమలో తాము కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉంటే మళ్లీ తెలంగాణలో అధికారం టిఆర్ఎస్ కానీ , బిజెపి గాని తన్నుకు పోయే ప్రమాదం ఉందనే అభిప్రాయంతో ఇప్పుడు కాంగ్రెస్ మరింత స్పీడ్ పెంచినట్లు గా కనిపిస్తోంది. మొన్నటివరకు టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని రేవంత్ రెడ్డి ఒక్కరే పోరాటం చేసేవారు. నాయకులంతా రేవంత్ దూకుడు ఎలా తగ్గించాలి అన్నట్లుగా ఆయన పైన విమర్శలు చేస్తూ, వచ్చేవారు. దీని కారణంగా టిఆర్ఎస్ కు బాగా కలిసి వచ్చేది. ఇక ప్రజల్లోనూ, కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలని, వారిలో వారే తిట్టుకుంటూ ఉంటారు తప్ప, ప్రజా సమస్యల విషయంలో పోరాడేందుకు గాని,  ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కానీ ఆసక్తి చూపించరు అనే అభిప్రాయం పెరిగిపోతుండటం వంటి కారణాలతో ఆలోచనలో పడ్డ సీనియర్లంతా, ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటానికి దిగినట్టుగా కనిపిస్తున్నారు.
 ఒకవైపు మల్లు భట్టి విక్రమార్క ఆసుపత్రుల సందర్శన పేరుతో తెలంగాణ అంతా తిరుగుతూ, టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జరిగిన ప్రమాదంపై విచారణ చేయించాలని అంటూ హడావుడి చేస్తున్నారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం విమర్శలు మొదలు పెట్టారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం వివిధ సమస్యలపై కెసిఆర్ ను కలిసేందుకు తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలని, లేకపోతే నిరసన దీక్ష చేపడతాను అంటూ హడావుడి చేస్తున్నారు. ఇలా కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకుల హడావుడి తో తెలంగాణలో ఆ పార్టీకి ఊపు వచ్చినట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ స్పీడ్ అయ్యాక బిజెపి కాస్త సైలెంట్ అయినట్టుగా తెలంగాణలో రాజకీయ వాతావరణం నెలకొంది. ఇదే స్పీడ్ కొనసాగిస్తే కాంగ్రెస్ తెలంగాణలో మళ్ళీ బలం పుంజుకోవడం ఖాయమే అనే అభిప్రాయాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.
-సూర్య 

Read more RELATED
Recommended to you

Exit mobile version