తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఎవరు అన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ఇవాళ ఇద్దరూ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ల పేర్లను ఏఐసీసీ ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఇవాళ ఉత్తర్వులను జారీ చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలపడంతో వీరు కాంగ్రెస్ తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తారని పేర్కొన్నారు.
మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరికి రాజ్యసభ సీటు దక్కుతుందని మొదటి నుంచి ప్రచారం జరిగినప్పటికీ.. అనూహ్యంగా మాజీ ఎంపీ అంజన్ యాదవ్ కుమారుడు అనిల్ యాదవ్ కి బెర్తు కన్పామ్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ రేసులో ఉన్నట్టు పెద్దగా వార్తలు సైతం ఎక్కడ వినిపించలేదు. నామినేషన్ కి దాఖలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న సమయంలో అనూహ్యంగా అనిల్ కుమార్ యాదవ్ పేరు ఫైనల్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.