తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటించాల్సిన మరో 19 స్థానాలపై నేతలు కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఇవాళ జాబితా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇందులో రెండు, మూడు నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మూడు రోజులు గడిచినా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ప్రచారంలో వెనకబడిపోతామని ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడం.. బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకెళ్తుండటంతో తాము మరింత వెనకబడిపోతామని భావిస్తున్నారు హస్తం ఆశావహులు.
మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు, వైరా, ఇంకోవైపు కొత్తగూడెం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో కొత్తగూడెం సీపీఐకి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సూర్యాపేట, తుంగతుర్తిలో పోటీ తీవ్రంగా ఉండటంతో ఈ స్థానాలపై అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఏదేమైనా ఇవాళ్టితో పూర్తిగా చర్చలు జరిపి సాయంత్రంలోగా మూడో జాబితా విడుదల చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.