‘జలశక్తి’ సమావేశాన్ని వాయిదా వేయండి.. మరోసారి తెలంగాణ లేఖ

-

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్వహణ విషయంలో దిల్లీలో జలశక్తి సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు కారణాలతో రెండుసార్లు వాయిదా పడిన ఈ సమావేశం ఇవాళ కూడా వాయిదా పడేటట్లు కనిపిస్తోంది. ఈనెల 2వ తేదీన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించిన అనంతరం తదుపరి సమావేశం మూడో తారీఖు జరగాలని నిర్ణయించారు. అయితే 3వ తేదీన తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఉండటంతో వాయిదా వేయాలని జలశక్తి అధికారులను తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కోరారు. అలా 6వ తేదీన ఈ భేటీ జరపాలని నిర్ణయించినా తుపాను కారణంగా మరోసారి వాయిదా పడింది.

ఇక ఇప్పుడు ఇవాళ నిర్వహించాలని జలశక్తి అధికారులు నిర్ణయించగా.. ఈరోజు సమావేశాన్ని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) శాంతికుమారి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు గురువారం ఆమె జలశక్తి మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిందని, మంత్రి మండలి సమావేశాలు, ఇతర ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమై ఉందని లేఖలో పేర్కొన్నారు.  దీనిని దృష్టిలో పెట్టుకుని సమావేశాన్ని జనవరిలో నిర్వహించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇంకా జలశక్తి శాఖ స్పందించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version