లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు పలు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసే యోచనలో రాష్ట్ర సర్కార్ ఉన్నట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీకి కసరత్తు షురూ అయినట్లు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ పదవీ విరమణ చేయనున్న వారితో సహా పలు వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం 3,800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనుండగా.. మార్చి నెలాఖరు నుంచి వీరి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి.
కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండటంతో పాఠశాల విద్యాశాఖ ఆయా గణాంకాలను సేకరించింది. గతేడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేయగా.. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని ప్రస్తుత సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలోనే పాత నోటిఫికేషన్‌కు సుమారు మరో 5 వేల ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేలోపు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.