నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం

-

-21 రోజులపాటు సాగనున్న దశాబ్ది ఉత్సవాలు

తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం అయిన రోజు. 58 ఏళ్లపాటు వివక్షకు గురైన జనం సొంత రాష్ట్రం సాధించుకున్న రోజు. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఇవాల్టితో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తయ్యాయి. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అఖండ ఉద్యమ స్పూర్తితో సాగించిన పోరాటాల ఫలితంగా దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

పదేళ్లుగా ప్రజల ఆకాంక్షల కోసం కృషి చేస్తూ దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ అభివృద్ధి పథంలో శరవేగంగా ముందుకెళుతోంది. ఉద్యమ నేత కేసీఆర్.. సీఎంగా రెండోసారి పదవిలో కొనసాగుతున్న సమయంలో దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇంతకీ తెలంగాణ రాష్ట్ర నినాదం ఎలా వచ్చింది..? ఉద్యమం ఎలా ప్రారంభమైంది? ఆవిర్భావం తరువాత తెలంగాణ రాష్ట్రం ఎటు వైపు పయనించింది? అభివృద్ధి తీరు ఎలా ఉంది?

ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రరాష్ట్రం వేరుపడిన సమయంలో తెలంగాణ ప్రాంతాన్ని కలిపేందుకు ఆనాడు అనేక మంది ఒప్పుకోలేదు. కానీ 58 ఏళ్ల పాటు అణచివేతకు గురైంది. 1969లో తొలిదశ ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. ఓయూలో విద్యార్థుల పోరాటం, కొందరి బలిదానంతో తారా స్థాయికి చేరింది. తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా ఉద్యమం మరుగునపడిపోయింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి గొంతెత్తి నినదించారు. ఈ సమయంలోనే 2001 ఏప్రిల్ 21వ తేదీన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 2004లో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. దీంతో తెలంగాణ ఏర్పాటు జాతీయ అజెండాగా మారింది. ప్రత్యేక రాష్ట్రం కోసం 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించారు. కేసీఆర్ దీక్షకు యావత్ తెలంగాణ సమాజం మద్దతు పలికింది. నవంబర్ 29 వ తేదీ నుంచి ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. కేసీఆర్ నిమ్స్‌లో దీక్ష కొనసాగించడంతో డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. దీంతో కేసీఆర్ దీక్ష విరమించారు.

తెలంగాణను సాధించిన నేత రాష్ట్రానికి సీఎం కావడంతో అన్నిరంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోంది. పాలకుల్లో సంకల్పం ఉంటే అద్భుతాలు ఎలా ఉంటాయో కాళేశ్వరం ప్రాజెక్టు పనులే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మల్లన్నసాగర్‌, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ, గౌరవెల్లి, తపాస్‌పల్లి, తోటపల్లి, సింగూరు, హల్దీవాగులతో ఉమ్మడి మెదక్‌ సస్యశ్యామలంగా మారింది. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందు వరుసలో నిలిచింది.

రైతులకు రాష్ట్ర సర్కార్ పెద్ద పీట వేసింది. రైతు బీమా, రైతు బంధుతో అన్నదాతలకు అండగా నిలిచింది. ఇక కేసీఆర్ కిట్లు, ఆసరా పెన్షన్లు, కంటి వెలుగు, షాదీ ముబారక్ వంటి పథకాలతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెట్టింది. అటు.. పారిశ్రామిక అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పరిశ్రమలకు రాయితీలతో పాటు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చేందుకు టీఎస్ ఐపాస్ వంటి విప్లవాత్మక విధానాలకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు దోహదపడింది.

ఈ పదేళ్ళలో చేసిన అభివృద్ధిని ప్రజల కళ్ళకు కడుతూ సంప్రదాయ దశాబ్ది ఉత్సవాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. జూన్ 2వ్ తేదీ మొదలు ఈ నెల 21వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని వర్గాల వారు ఈ ఉత్సవాలలో భాగస్వాములయ్యేలా చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news