టీచర్ల బదిలీలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఇవాళ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. జీవో 317తో బదిలీ అయిన టీచర్లకు పూర్వ జిల్లా సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈనెల 12 నుంచి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా టీచర్ల బదిలీల ప్రక్రియ జరుగుతోంది. ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజి పండిట్లను బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, బదిలీలకు సంబంధించిన నిబంధనల్లో కనీసం ఒకేచోట రెండేళ్లు పనిచేసిన వారు మాత్రమే బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఉమ్మడి జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు 317 జీవో ప్రకారం బదిలీ అయిన వారికి రెండేళ్ల సర్వీసు పూర్తి లేదు.
దీంతో.. తాము ఉమ్మడి జిల్లా నుంచి కొత్త జిల్లాకు వచ్చామని, ఉమ్మడి జిల్లాలోని సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారి అభ్యర్థనను పరిశీలించి.. ఇలాంటి ఉపాధ్యాయులు దాదాపు 25వేల మంది ఉన్నందున ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.