గిరిజన యూనివర్సిటీకి తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్ సెలక్ట్ చేసింది. ములుగులో 221 ఎకరాలు ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఈ నెల 26న జరిగే క్యాబినేట్ లో తీర్మాణం చేయనున్నారు. ఆ తర్వాత సదరు భూమి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించనుంది. దీంతో ఏళ్ల తరబడి పెండింగ్ లోని సమస్యకు చెక్ పడనుంది. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం గత కొన్నేళ్ల నుంచి స్థలం కేటాయించలేదనే కారణంతో యూనివర్సిటీ ఏర్పాటుకు ఆలస్యమైందని కేంద్రం చెబుతూ వచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క నేతృత్వంలో వివిధ దశల్లో సుదీర్ఘంగా అధ్యయనం తర్వాత స్థలం కేటాయించారు.
కేంద్ర ప్రభుత్వ అధికారులతోనూ ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ.. ఈ భూమి కేటాయింపును ఫైనల్ చేశారు. వాస్తవానికి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు దాదాపు 500 ఎకరాల స్థలం అవసరం అవుతుందని గతంలో కేంద్రం పేర్కొన్నది. ఒకే చోట అంత అన్ని ఎకరాల భూమి సమకూర్చడం కష్టమని, రెండు చోట్ల కేటాయించడం వీలవుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. దీనికి చాలా ఏళ్ల తర్వాత అంగీకరించిన కేంద్రం, తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకునేందుకు సిద్దం అయింది.