హైదరాబాద్ నగర వాసులకు ఇక నీటి ఎద్దడి తప్పనుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గోదావరి ఫేజ్-2 తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు రాష్ట్ర సర్కార్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.5,560 కోట్ల వ్యయంతో మల్లన్నసాగర్ నుంచి మరో 15 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్కు తరలించేందుకు అనుమతిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది.
ఇక గోదావరి నుంచి తరలించిన నీటిని శుద్ధి చేసేందుకు శామీర్‌పేట, గండిపేట, రాజేంద్రనగర్ వద్ద భారీ శుద్ధి కేంద్రాలు (డబ్ల్యూటీపీ) నిర్మించనున్నారు. పంప్‌హౌస్‌లు, విద్యుత్తు ఉపకేంద్రాలు ఇందులో భాగంగా ఉంటాయి. ప్రస్తుతం గోదావరి నుంచి ఏటా 10 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి నగరానికి తరలిస్తున్నారు. ఇక ఫేజ్-2 రెడీ అయిన తర్వాత తరలించే నీటిలో 10 టీఎంసీలు నగర తాగునీటి అవసరాలకు వాడనున్నారు. మిగిలిన 5 టీఎంసీలు మూసీ ప్రక్షాళనతోపాటు జంట జలాశయాల పరిధిలోని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.