రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ – (టీజీఐఐసీ) ద్వారా 5 వేల కోట్ల రూపాయలను రుణాల ద్వారా సమీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కార్పొరేషన్ భూములపై అప్పు తీసుకునేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఆయా భూముల అభివృద్ధి, కేటాయింపులు తదితరాల రూపంలో నిధులు సమీకరించాల్సి ఉంటుంది.
రుణాల ద్వారా నిధుల సమీకరణ కోసం అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ ఎంపిక కోసం టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసిన టీజీఐఐసీ టెండరు దాఖలుకు 12వ తేదీ వరకు గడువు ఇచ్చింది. సాంకేతిక బిడ్లను 12వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు, ఆర్థిక బిడ్లను ఆ తర్వాత తెరుస్తారు.
ఎంపికైన బ్యాంకర్ బాండ్లు జారీ చేసి కనీసం 5000 కోట్ల రూపాయలను సమీకరించి కార్పొరేషన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. నిర్ధేశిత గడువులోగా 5000కోట్ల మొత్తాన్ని సమీకరించి సంతృప్తికరంగా ఉంటే అదనంగా మరో 12 నెలల వరకు పొడిగించే అంశాన్ని కూడా పొందుపరిచారు. ఆ సమయంలో అదనంగా మరింత మొత్తాన్ని బ్యాంకర్ సమీకరించాల్సి ఉంటుంది.