తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ విడుదలైంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ మంగళవారం రాత్రి తన వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో మాస్టర్ ప్రశ్నపత్రం ప్రకారం 3, 4, 5, 46, 54, 114, 128, 135.. ఎనిమిది ప్రశ్నలను తొలగించిన కమిషన్ రెండు ప్రశ్నల సమాధానాలను మార్చింది. 38వ ప్రశ్నకు ప్రాథమిక కీలో సమాధానం 3 ఉండగా తుది కీలో సమాధానం 2గా మారింది. అలాగే… 59వ ప్రశ్నకు సరైన జవాబును 1 నుంచి 3గా మారింది. ప్రిలిమ్స్‌లో ఎనిమిది ప్రశ్నలను తొలగించినందున ప్రస్తుతం 142 ప్రశ్నలే మిగిలాయి. వీటికి వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుని 150 మార్కులకు దామాషా పద్ధతిలో లెక్కిస్తారు.
జూన్ 11న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రిలిమ్స్ కీని జూన్ 28న విడుదల చేసిన కమిషన్ జులై 1 నుంచి 5 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. ఇలా వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల కమిటీ తుది కీని విడుదల చేసింది.