‘డబుల్‌’ ఇళ్ల కేటాయింపు పురోగతిపై నివేదిక ఇవ్వండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

-

తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిర్మాణం పూర్తయిన డబల్ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడం లేదంటూ 2021లో బీజేపీ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.

రాష్ట్రవ్యాప్తంగా లక్ష  43 వేల 544 డబల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తికాగా.. ఇప్పటి వరకు 65 వేల 538 ఇళ్లను మాత్రమే లబ్ధిదారులకు కేటాయించినట్లు ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొదటి విడతలో 4 వేల74 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించినట్లు తెలిపిన ప్రభుత్వం.. సెప్టెంబరు మొదటి వారం నాటికి 12 వేల 275 ఇళ్లను కేటాయిస్తామని వివరించింది. జీహెచ్‌ఎంసీలో నవంబరు మొదటి వారం నాటికి మొత్తం ఆరు విడతల్లో డబల్ బెడ్ రూం ఇళ్లన్నీ  కేటాయిస్తామని వివరించింది. రెండు, మూడు వారాల సమయం ఇస్తే మరింత పురోగతితో నివేదిక ఇస్తామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొనడంతో అందుకు అంగీకరించిన హైకోర్టు.. విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news