ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో జగన్‌కు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తాజాగా నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై విచారణ చేపట్టింది. పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపి.. హరిరామ జోగయ్య దాఖలు చేసిన సవరణలను పరిగణనలోకి తీసుకుంది.
ఈ క్రమంలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. పిల్‌కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ప్రతివాదులు జగన్, సీబీఐ, సీబీఐ కోర్టుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలంటూ హరిరామజోగయ్య పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2024లో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోపు కేసులను తేల్చేలా ఆదేశాలివ్వాలని ఆయన పిల్లో పేర్కొన్నారు.