జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్-4 స్థాయిలో క్రమబద్ధీకరించకుండా ఒప్పంద గడువును మరో ఏడాది పాటు పొడిగించడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామక ఒప్పందం గడువును 3 నుంచి 4 ఏళ్లకు పొడిగిస్తూ గత ఏడాది జులైలో జారీ చేసిన జీవో 26ను సవాలు చేస్తూ తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ తరఫున ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీకాంత్, మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం జస్టిస్ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ కోసం 2018 ఆగస్టులో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.దీని ప్రకారం అభ్యర్థులు రాత పరీక్షకు హాజరై నియమితులయ్యారన్నారు. నియామకం సమయంలో పంచాయతీరాజ్ కమిషనర్ పలు షరతులతో ఒప్పందం చేయించుకున్నారని తెలిపారు. సంతృప్తికరంగా మూడేళ్ల సర్వీసు పూర్తయ్యాక గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరణ ఉంటుందని పేర్కొన్నారని చెప్పారు.
ఈ నిబంధనకు విరుద్ధంగా ఒప్పందం గడువును 3 నుంచి 4 ఏళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని కోర్టుకు విన్నవించారు. మూడేళ్లు పూర్తయిన తేదీ నుంచి గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.