గురుకులాల్లో ఆర్ట్స్‌ టీచర్‌ పోస్టులకు మళ్లీ పరీక్ష : హైకోర్టు

-

గురుకుల విద్యాసంస్థల్లో ఆర్ట్స్‌ టీచర్‌ పోస్టులపై హై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక మండలి (టీఆర్‌ఈఐఆర్‌బీ)ను హైకోర్టు ఆదేశించింది. పరీక్ష నోటిఫికేషన్‌కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

గురుకుల విద్యాసంస్థల్లో 132 ఆర్ట్స్‌ టీచర్‌ పోస్టులకు గత ఏడాది ఆగస్టు 1వ తేదీన నిర్వహించిన పరీక్షలో ప్రశ్నలను తెలుగులో ఇవ్వకుండా కేవలం ఆంగ్లంలోనే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన జి.వినోద్‌తోపాటు వివిధ జిల్లాలకు చెందిన మరో 8 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఆకాశ్‌ బాగ్లేకర్‌ వాదనలు వినిపిస్తూ.. ఆర్ట్స్‌ టీచర్‌ పోస్టులకు టీఆర్‌ఈఐఆర్‌బీ 2023 ఏప్రిల్‌ 5న నోటిఫికేషన్‌ జారీ చేసిందని, ప్రశ్న పత్రం తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉంటుందని అందులో పేర్కొందన్నారు.

అయితే ఆగస్టు 1న ఆన్‌లైన్‌ పరీక్ష ప్రశ్నపత్రం కేవలం ఆంగ్లంలో మాత్రమే ఉండటంతో పిటిషనర్లు పరీక్ష సరిగా రాయలేకపోయారని, ఇది తెలుగు తెలిసినవారి పట్ల వివక్ష చూపడమేనని అన్నారు.  అంతేగాకుండా రాజ్యాంగంలోని షెడ్యూలు 8, అధికరణ 14కు విరుద్ధమని తెలిపారు. టీఆర్‌ఈఐఆర్‌బీ తరఫు న్యాయవాది ఎన్‌.రమేశ్‌ వాదనలు వినిపిస్తూ గురుకుల విద్యాసంస్థలన్నీ ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తున్న అయిదు రెసిడెన్షియల్‌ సొసైటీల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయన్నారు.

గత ఏడాది ఈ నోటిఫికేషన్‌తో పాటు డిగ్రీ, జూనియర్‌ కాలేజీ లెక్చరర్లు, లెబ్రేరియన్‌లు, ఫిజికల్‌ డైరెక్టర్స్‌, పీజీటీ, టీజీటీ, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌, ఆర్ట్స్‌ అన్నింటికీ కలిపి 9 నోటిఫికేషన్‌లు జారీ అయ్యాయని, అన్నింటిలోనూ ప్రశ్న పత్రాలు ఆంగ్లంలోనే ఉన్నాయన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి టీఆర్‌ఈఐఆర్‌బీ తాను విడుదల చేసిన నోటిఫికేషన్‌కు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version