కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు

-

కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీలు, వృత్తివిద్యా కోర్సుల్లో కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్న లెక్చరర్ల క్రమబద్ధీకరణను నిలిపిచేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని కోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 3 వారాలు వాయిదా వేసింది.

ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు చెందిన చట్టంలో సెక్షన్ 10ఏ చేరుస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో18ను సవాల్‌చేస్తూ 16 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. క్రమబద్ధీకరణ పేరిట దొడ్డిదారిన నియమాకాలు జరుగుతున్నట్లు పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. క్రమబద్దీకరణలో భాగంగా సుమారు 5 పోస్టులు భర్తీచేస్తున్నారన్న పిటిషనర్లు.. ఆ ప్రక్రియ పూర్తైతే అన్ని అర్హతలున్న తాము కొత్త ఉద్యోగాల్లో అవకాశాలు కోల్పోతామని వాదించారు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నా ప్రతిపాదనలు పంపాలని కొన్నిశాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు.

అనంతరం వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్ ప్రసాద్‌…చట్టానికి సవరణ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. చట్టప్రకారమే క్రమబద్ధీకరణ విధాన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కౌంటర్లు దాఖలు చేయడానికి గడువు కావాలని, ఇదే అంశంపై పిటిషన్లు పెండింగ్ ఉన్నాయని వాటితో కలిపి విచారించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం…ప్రక్రియను నిలిపి చేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసింది. క్రమబద్ధీకరణను నిలిపి చేసినట్లయితే ఆ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చన్నారు. అందువల్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను నిలిపిచేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. పిటిషన్ విచారణలో ఉండగా క్రమబద్ధీకరణ జరిగితే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టంచేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version