గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కేసులో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. హైవే కోసం భూసేకరణ ఆపాలంటూ హనుమకొండ జిల్లా బాధిత రైతులు వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. రైతులను భూముల నుంచి ఖాళీ చేయవద్దని హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మంచిర్యాల-వరంగల్ హైవే పనుల నోటిఫికేషన్ నిలిపివేయాలని రైతులు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దాంతో 8 వారాల వరకు భూముల నుంచి ఖాళీ చేయించవద్దని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పర్యావరణ అనుమతి తీసుకోవాలని సూచించింది. కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు పంపింది.
హనుమకొండ జిల్లాలో ఈ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కారణంగా భూములు కోల్పోతున్న బాధిత రైతులు త్రీడీ, త్రీజీ నోటిఫికేషన్ నిలిపివేయాలంటూ ఫిబ్రవరి 22వ తేదీన హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం త్రీడీ, త్రీజీ నోటిఫికేషన్ను ప్రస్తుతానికి 8 వారాల పాటు నిలిపేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించింది.