త్వరలో జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ.. నాలుగో గ్రేడ్‌ పంచాయతీ కార్యదర్శులుగా గుర్తింపు

-

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు(జేపీఎస్​)లకు సర్కార్ తీపికబురు చెప్పింది. రాష్ట్రంలోని 9,350 మంది జేపీఎస్‌ క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైనట్లు తెలిపింది. వారిని నాల్గో గ్రేడ్‌ పంచాయతీ కార్యదర్శులుగా ఫీడర్‌ కేటగిరీలో గుర్తించేందుకు పంచాయతీరాజ్‌ సబార్డినేట్‌ నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా.. పంచాయతీ కార్యదర్శులు సర్వీసు నిబంధనల మేరకు గ్రేడ్‌-1, 2, 3, 4 అనే నాలుగు కేటగిరీల్లో ఉంటారు. ఇందులో జేపీఎస్‌లను నాల్గో గ్రేడ్‌లో చేర్చారు. ఈ గ్రేడ్‌కు డిగ్రీ అర్హతగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేసే వారంతా డిగ్రీ ఉత్తీర్ణులే అయినందున వారి క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుంది.

ఇప్పటివరకు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు శిక్షణలోనే ఉండగా… తాజా ఉత్తర్వులతో వారు ప్రభుత్వ ఉద్యోగులయ్యే అవకాశం ఏర్పడింది. జిల్లాల వారీగా సంఖ్య(కేడర్‌ స్ట్రెంత్‌) నిర్ధారణ అయితే జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ జరుగుతుంది. ప్రస్తుతమున్న జేపీఎస్‌లను ప్రభుత్వం ఒప్పంద ప్రాతిపదికనే నియమించిన విషయం తెలిసిందే. వారిని ప్రభుత్వ సర్వీసులో చేర్చలేదు. రెండేళ్ల శిక్షణ కాలం పూర్తయ్యాక అది జరగాల్సి ఉండగా… ఆలస్యమవ్వడంతో.. తమను ప్రభుత్వ సర్వీసులో చేర్చాలని జేపీఎస్‌లు రెండేళ్లుగా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఇక ఇప్పుడు సర్వీసు నిబంధనలను సవరించి తాజా ఉత్తర్వులతో వారిని ఫీడర్‌ కేటగిరీ కింద ప్రభుత్వ సర్వీసులోకి చేర్చేందుకు అవకాశం ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news