తెలంగాణ శాసనమండలి నూతన భవనం నిర్మాణంపై రాష్ట్ర సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ఉన్న జూబ్లీ హాల్ ప్రాంగణంలో ప్రస్తుతం శాసన మండలి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే ప్రాంగణంలో నూతన భవనాన్ని నిర్మించాలనేది సర్కార్ యోచిస్తోంది. అయితే మండలి భవన నిర్మాణానికి చారిత్రక చిక్కులు వచ్చాయి పడినట్లు సమాచారం. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో 1937 ప్రాంతంలో జూబ్లీహాల్ భవనం రూపుదాల్చింది. ఆ తరవాత అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి రాగా.. 2006 నుంచి ఆ భవనంలోనే శాసనమండలి సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అదే ప్రాంగణంలో నూతన భవనం నిర్మించాలంటే భవనాన్ని కూల్చాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన అనుమతులు తెచ్చేందుకు, అడ్డంకులు అధిగమించేందుకు కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పటివరకు సమావేశాలు ఎక్కడ నిర్వహిస్తారనేది మరో ప్రశ్న. ఆయా సమస్యలు కొలిక్కి తేవాలని రాష్ట్ర సర్కారు ప్రతిపాదించిన నేపథ్యంలో అధికారులు సంబంధిత కసరత్తును ఆరంభించారు.