తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు తెలంగాణలో 24.31 శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్‌లో 31.83 శాతం, హైదరాబాద్‌లో అత్యల్పంగా 10.70 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఉదయం 11 గంటల వరకు లోక్‌సభకు ఏపీలో 23.10 శాతం, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 23 శాతం ఓటింగ్ నమోదైంది. ఏపీలో అత్యధికంగా బాపట్లలో 27.03 శాతం.. అరకులో అత్యల్పంగా 16.99 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక ఏపీలోని కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి ఇలా ఉంది. కుప్పంలో 26.47 శాతం నమోదుకాగా.. పిఠాపురంలో 22.56 శాతంగా ఉంది. ఇప్పటివరకు మంగళగిరిలో 18.82 శాతం, పులివెందులలో 31.06 శాతం ఓటింగ్ వచ్చింది.