లోక్‌సభ ఎన్నికల సమరం చివరి మజిలీకి చేరింది. ప్రచార గడువుకు రెండ్రోజులు మాత్రమే ఉంది. ఈ 48 గంటలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ పక్కా వ్యూహాలు రచించాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే రేపటితో సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగియనుండటంతో ప్రధాన పార్టీలన్నీ తటస్థ ఓటర్లపై దృష్టి సారించాయి.
అగ్రనేతలు, అభ్యర్థులు నిర్వహిస్తున్న బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్‌లు, తమ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మే 13వ తేదిన పోలింగ్ జరగనుండగా రేపటితో ప్రచార గడువు ముగుస్తుంది. దీంతో నేరుగా ఓటర్లతో అనుసంధానంపై పార్టీలు దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల స్థానిక నాయకులు, కార్యకర్తలు పోలింగ్ బూత్‌ల వారిగా ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. ఇంటింటికి వెళ్తూ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో వివరిస్తూ.. తమ మేనిఫెస్టో గురించి చెబుతూ తమ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేయాలని కోరుతున్నారు.