అధికారుల బదిలీలు, పోస్టింగులపై కొత్తప్రభుత్వం దృష్టి సారించనుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్ సర్కార్ మొదటి రోజే తొలి మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కీలకమైన అధికారుల పోస్టింగులపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి శేషాద్రిని నియమించారు. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ పోస్టుల్లో పనిచేసిన శేషాద్రి ప్రధానమంత్రి కార్యాలయంలోనూ పనిచేశారు. నిన్నటివరకు సాధారణ పరిపాలన శాఖ బాధ్యతలు నిర్వర్తించిన ఆయనని సీఎంఓ కార్యదర్శిగా నియమించారు.
అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. వివిధకారణాలతో ప్రభుత్వం ఆయన్ని అక్కడనుంచి బదిలీ చేసింది. ఎన్నికల్లో ఘన విజయంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తరుణంలో మరోసారి ఆయనకు నిఘా విభాగం బాధ్యతలు అప్పగించారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు అనివార్యం కానున్నాయి. కొత్త ప్రభుత్వం తన అభిమతానికి అనుగుణంగా కీలకపోస్టుల్లో నియామకాలు చేపట్టనుంది.