తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఇవాళ గాంధీభవన్లో జరగనుంది. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు ఈ భేటీకి హాజరవుతారు. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్లమెంట్ ఎన్నికలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
చాలా రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సమావేశం జరగకపోవడం, ఎన్నికల ఫలితాల తర్వాత సమీక్ష చేయకపోవడం, హైదరాబాద్ నగరంలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు తగిన కార్యాచరణ లేకపోవడం తదితర అంశాలపై చర్చించేందుకు ఈరోజు గాంధీభవన్లో పీఏసీ మీటింగ్ నిర్వహిస్తున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాణిక్యరావు ఠాక్రే అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఉమ్మడి జిల్లాలు, నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన, గెలవలేకపోయిన పరిస్థితులను, లోటుపాట్లను చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనంగా ఉండటం, ఇక్కడ ఒక అభ్యర్థి కూడా గెలవకపోవడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందన్న భావన నగరవాసుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నిమిత్తం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.