తెలంగాణ వ్యాప్తంగా యాసంగి సీజన్‌లో 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 6,345 కేంద్రాల ద్వారా 47.07 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరిగాయి. ధాన్యం విక్రయించిన 8,35,109 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,355.18 కోట్లు జమచేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వడ్లు అమ్మిన మూడు రోజుల్లోనే డబ్బు ఖాతాలో వేసినట్టు తెలిపింది. ధాన్యం సేకరణలో ఈసారి జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, జనగామ జిల్లాలు ముందంజలో ఉన్నాయని తెలిపింది.
ఈసారి దాదాపు రెండు వారాల ముందుగా మార్చి 25 నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని ప్రభుత్వం తెలిపింది. జూన్ 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయని పేర్కొంది. రాష్ట్రంలో చాలాచోట్ల సేకరణ ప్రక్రియ పూర్తయిందని.. మరో 10 రోజులపాటు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అంచనా వేస్తోంది. ఆలస్యంగా పంటలు వేసిన రైతులకు ఇబ్బంది తలెత్తకుండా నెలాఖరు వరకు అవసరమైన చోట్ల కేంద్రాలు తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.