తెలంగాణలో చాలా వరకు భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ధరణిలో అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం మార్చిలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తులను జూన్ 4లోపు పరిష్కరించాలని లక్ష్యం నిర్దేశించింది. అయితే పరిష్కార ప్రక్రియలో వేగం తగ్గడమేగాక .. లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో డ్రైవ్‌ను రెవెన్యూ శాఖ నిలిపివేయడంతో లక్ష దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయింది. వీటికి పాసు పుస్తకాలు జారీ చేయాల్సి ఉంది.
మరో 1.46 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలు ముగిసి కోడ్ తొలగిపోయే లోపు వివిధ సమస్యలకు సంబంధించి ధరణిలో మరో 60 వేల దరఖాస్తులు రావడంతో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య మళ్లీ 2.06 లక్షలకు చేరుకుంది. రైతులు గత ఏడాది అక్టోబరుకు ముందు ధరణి పోర్టల్‌లో చేసుకున్న దరఖాస్తులను కొన్ని జిల్లాల కలెక్టర్లు ఎడాపెడా తిరస్కరించింది. ఇప్పుడు రెవెన్యూ శాఖ అన్ని సమస్యలపై దృష్టి పెడుతుండటంతో రైతులు తిరిగి దరఖాస్తు చేసేందుకు ముందుకు వస్తున్నారు.