అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే శాసనసభ ఎన్నికల మాదిరే ఎంపీ సీట్ల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇప్పటి వరకు 17 లోక్సభ స్థానాలకు గానూ మొత్తం 309 మంది దరఖాస్తు చేసుకోగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై పీసీసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, ఇతర జాతీయ నేతలు జిగ్నేశ్ మేవాని, విశ్వజిత్ పాల్గొననున్నారు. 17 నియోజకవర్గాలకు సగటున ఒక్కో స్థానానికి 18 మందికిపైగా కాంగ్రెస్‌లో టికెట్ కోసం పోటీపడుతుండగా.. అత్యధికంగా ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానమైన మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి 47 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అతి తక్కువ దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాల్లో మహబూబ్‌నగర్ టికెట్ కోసం కేవలం నలుగురు మాత్రమే దరఖాస్తు చేసినట్లు వెల్లడించాయి.