భానుడి భగభగలతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. ఇవాళ, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పలుప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించారు. ఈరోజు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, రేపు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలిక పాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు.
గురువారం రోజున కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ఒకటి దక్షిణ అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ. ఎత్తులో ఏర్పడిందని తెలిపింది. రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటు వాతావరణ శాఖ అధికారులు, ఇటు వైద్యులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు చేరుతున్నందున అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వీలైనంత వరకు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు.