అకాల వర్షాలు మరోసారి రాష్ట్రంలో విలయం సృష్టించాయి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా పడిన వాన రైతులు, సామాన్యులను ఆగం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొన్ని గంటలసేపు జనజీవనం స్తంభించింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి ఇటు పటాన్‌చెరు వరకు, పాతబస్తీ నుంచి మాదాపూర్ వరకు, మేడ్చల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కురిసిన వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి.
రోడ్లన్నీ జలమయమై వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. పిడుగుపాటుకు సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు రైతులు, రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు మృతిచెందారు. నల్గొండ జిల్లా కనగల్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 10.2 సెంటీమీటర్ల వాన కురిసింది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో 9 సెం.మీ, షేక్‌పేటలో 8.7 సెం.మీ. వర్షం పడింది. ఖైరతాబాద్, కోఠి, అఫ్జల్‌గంజ్, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, జూబ్లీహిల్స్, బాలానగర్, అల్వాల్, శేరిలింగంపల్లి, గోల్కొండ, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వరద ఏరులై పారింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 14 మండలాల్లో 6.7 నుంచి 9 సెంటీ మీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది.