Telangana : మొదటి త్రైమాసికంలో రాబడి రూ.29,212 కోట్లు

తెలంగాణలో ప్రస్తుత (2022-23) ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సొంత పన్నుల రాబడి.. అంచనాల మేరకు ఉన్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ విశ్లేషించింది. తొలి మూడు నెలల్లో పన్నుల ద్వారా రూ.29,212 కోట్లు వచ్చినట్లు పేర్కొంది.


ఏడాది మొత్తం పన్నుల రాబడి అంచనా రూ.1,26,606 కోట్లు కాగా అందులో 23 శాతం సమకూరినట్లు తెలిపింది. మొదటి త్రైమాసికం రాబడులు, వ్యయ వివరాలను రాష్ట్ర ఆర్థిక శాఖ తాజాగా కాగ్‌కు అందజేసింది.

గత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల రెవెన్యూ రాబడుల కంటే ఈ ఏడాది మొదటి త్రైమాసికం రాబడులు ఐదు శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. బడ్జెట్‌ అంచనాల్లో ఇప్పటి వరకు రాబడులు 17.7 శాతం రాగా.. రెవెన్యూ వ్యయం అంచనాల్లో 20 శాతంగా పేర్కొంది. జూన్‌ వరకు రాష్ట్ర రెవెన్యూ రాబడులు రూ.37,513 కోట్లు కాగా.. ఇది అంచనాల్లో 19.4 శాతం. ఇందులో పన్ను రాబడులు రూ.29,212 కోట్లు.

కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ మాత్రం అంచనాల్లో కేవలం 3.4 శాతం మాత్రమే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బాండ్ల విక్రయం ద్వారా రూ.52,167 కోట్ల మార్కెట్‌ రుణాలను తీసుకోవాలని ప్రతిపాదించగా జూన్‌ వరకు రూ.5,436 కోట్లను సమీకరించుకోగలిగింది.