వచ్చే బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.6400 కోట్లు కేటాయించాలని రవాణా శాఖ విజ్ఞప్తి

-

రానున్న బడ్జెట్‌లో ఆర్టీసీకి 6,400 కోట్లు కేటాయించాలని రాష్ట్ర రవాణా శాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖల పద్దులపై ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఉన్నతాధికారులతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్షించారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో భారీగా రద్దీ పెరిగిందని. అందుకు అనుగుణంగా 2వేల బస్సుల్ని కొనుగోలు చేయాల్సి ఉందని అధికారులు వివరించారు. ఆర్టీసీలో భారీగా ఉన్న ఖాళీలు సైతం భర్తీ చేయాలని కోరారు.

బడ్జెట్‌ కేటాయింపుల్లో తమ శాఖకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్ధికశాఖ మంత్రి భట్టి విక్రమార్కకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఏటా రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయిస్తున్న 15 వందల కోట్లను కొనసాగించాలని కోరారు. అలాగే కొత్త బస్సుల కొనుగోలుకు 900 కోట్లు ఇవ్వాలని, ఉచిత ప్రయాణం అమలుకు ఏటా 4 వేల కోట్లు కేటాయించాలని విన్నవించారు.

రవాణా శాఖ విజ్ఞప్తులు విన్న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క.. ప్రభుత్వం అనేక పథకాలకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని అన్నారు. టిక్కెటేతర ఆదాయం పెంచుకోవాలని ఆర్టీసీ అధికారులకు సూచిస్తూ.. ఆర్టీసీ స్థలాలను వాణిజ్య అవసరాలకు కేటాయించి రాబడి పెంచుకోవాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news