తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆ సంస్థ రూ.5వేల కోట్లకుపైగా బకాయి పడినట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. పొదుపు చేసుకున్న సీసీఎస్ డబ్బులు, నగదుగా మారని పదకొండేళ్ల కిందటి వేతన ఒప్పందం బాండ్లు, డీఏ బకాయిలు ఇలా మొత్తం దాదాపు రూ.5,365 కోట్లకుపైగా బకాయిలు రావాల్సి ఉందని తెలిపాయి. ఇవాళ రవాణాశాఖపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి తమ కీలక సమస్యలకు పరిష్కారం చూపిస్తారని ఆర్టీసీ కార్మికులు ఎదురుచూస్తున్నారు.
ఆర్టీసీ కార్మికులకు చివరగా 2013కు సంబంధించిన వేతన సవరణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరగ్గా.. సవరణ బకాయిల్ని ఆర్టీసీ బాండ్ల రూపంలో ఇచ్చింది. ఇప్పటికీ ఆ బాండ్లను నగదు రూపంలోకి మార్చకపోవడమే గాక.. 2014 నుంచి లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లించలేదు. ఆర్టీసీలో ప్రతి నాలుగేళ్లకోసారి వేతన ఒప్పందం జరిగేలా యాజమాన్యం గతంలో కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకుంది. 2017, 2021లలో పీఆర్సీలు అమలు చేయాల్సి ఉందని కార్మిక సంఘాలు తెలిపాయి. ఇవాళ్టి భేటీలో వీటిపై సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని కార్మికులు చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.