నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు, సంబంధిత కాంపోనెంట్ల స్వాధీనానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఖరారు కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రేపు సమావేశం ఏర్పాటు చేయనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ లతో బోర్డు ఛైర్మన్ శివనందన్ కుమార్ సమావేశం కానున్నారు. దిల్లీలో ఈ నెల 17వ తేదీన కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ జరగనుంది
రెండు ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన 15 ప్రాధాన్యతా ఔట్ లెట్లను బోర్డుకు స్వాధీనం చేసేందుకు అవసరమైన ప్రోటోకాల్స్‌ను బోర్డు, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు ఖరారు చేయాలని దిల్లీ సమావేశం మినట్స్‌లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ, ఏపీ ఈఎన్సీలతో కృష్ణా బోర్డు ఛైర్మన్ గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. ఔట్ లెట్లను స్వాధీనం చేసేందుకు వీలుగా అవసరమైన ప్రోటోకాల్స్ పై చర్చించి ఖరారు చేయడంతో పాటు కార్యాచరణ ప్రణాళికను రూపొందించే విషయమై సమావేశంలో చర్చించనున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్ లకు కృష్ణా బోర్డు సమాచారం ఇచ్చింది.