సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని విడుదల చేశారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జయ జయహే తెలంగాణ గీత రచయిత అందె శ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి కూడా పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా సందేశాన్ని ప్రదర్శించారు.
“తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అమరవీరులకు నా శ్రద్ధాంజలి. తెలంగాణ స్వప్నాన్ని నెరవేరుస్తామని 2004లో కరీంనగర్ సభలో హామీ ఇచ్చాం. గడిచిన పదేళ్లుగా మా పార్టీ పట్ల ప్రజలు అత్యంత ప్రేమ, అభిమానాలు చూపారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా మా పార్టీ పని చేస్తుంది. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని నెరవేర్చే కర్తవ్యం మాపైన ఉంది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తాం” అని ఈ సందేశంలో సోనియా పేర్కొన్నారు.