తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండల తీవ్రత మొదలవుతోంది. సాయంత్రం 6 గంటలకు కానీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం లేదు. సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీనికి తోడు వడగాలుల తీవ్రత, ఉక్కపోతలతో జనాలు అల్లాడుతున్నారు. అవసరం ఉంటే తప్పితే మధ్యాహ్నాలు ఇళ్ల నుంచి బయట కాలు పెట్టడం లేదు.
మరోవైపు తెలంగాణ మీదుగా విదర్భ నుంచి రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో నేడు, రేపు రెండు రోజులు తెలంగాణలో అక్కడక్కడ వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నిన్న ( మంగళవారం) రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో 44.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. నిజామాబాద్ లో 44.8 డిగ్రీలు, జగిత్యాల జిల్లా కోల్వాయ్ 44.7 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.