తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులకు ఇవాళ్టి నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంలో భాగంగా ఈరోజు నుంచి ఉదయం గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, జనరల్ గురుకులాల్లోనూ ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు రోజూ ఒక సబ్జెక్టును చదివించనున్నారు.
రోజూ ఆ సబ్జెక్టు ఉపాధ్యాయుడే హాజరై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడంతోపాటు సమాధానాలను వారితో ప్రాక్టీస్ చేయిస్తారు. ఈ టైం టేబుల్‌ను రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసింది. జనవరి నుంచి వార్షిక పరీక్షల వరకు సాయంత్రం బడి వేళలు ముగిసిన తర్వాత మరో గంట ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 2.50 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. మరోవైపు సీఎం అల్పాహారం పథకం అమలవుతున్న పాఠశాలల్లో ఆకలి సమస్య లేనప్పటికీ మిగిలిన చోట్ల ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.