ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం పది గంటల నుంచి వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులో ఉంటాయని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. ఈనెల 15న 1139 కేంద్రాల్లో జరిగిన టెట్ పేపర్ వన్ కు 2 లక్షల 26 వేల 744 మంది.. పేపర్ టూ లక్ష 89 వేల 963 మంది రాశారు. జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి నిబంధనల ప్రకారం, విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలంటే తప్పనిసరిగా టెట్ లో అర్హత సాధించాలి.
రాష్ట్రంలో ఇప్పటివరకు అన్ని టెట్లు కలిపి పేపర్-1 లో లక్షన్నర.. పేపర్-2 లో రెండున్నర లక్షల మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో చివరగా గతేడాది జూన్ 12వ తేదీన విద్యాశాఖ టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్ వన్ లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి అయిదు తరగతులకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్ టూలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే జారీ అయిన విషయం తెలిసిందే. నవంబరు 20 నుంచి 30వ తేదీ వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ) జరగనుంది.