శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి కేటాయించిన నీటి వాటాల్లో తెలంగాణ కోటాకు మించి వాడుకుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదలశాఖ కార్యదర్శికి బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయిపురే లేఖ రాశారు. ఇటీవల తెలంగాణ రాసిన లేఖ నేపథ్యంలో బోర్డు పలు అంశాలను పరిశీలించిందని తెలిపారు.
2023 సెప్టెంబరు 30న కృష్ణా జలాల్లో వినియోగించుకునే నిల్వ 82.78 టీఎంసీలుగా బోర్డు గుర్తించినట్లు రాయిపురే చెప్పారు. త్రిసభ్య కమిటీ సమావేశంలో ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలు పోను 2024 జూన్, జులైలలో వినియోగానికి 2.78 టీఎంసీలను కేటాయించిందని గుర్తు చేశారు. అందులో ఇప్పటివరకు ఏపీ 41.95 టీఎంసీలు, తెలంగాణ 39.74 టీఎంసీలను వినియోగించుకున్నాయని వెల్లడించారు. అంటే ఏపీకి ఇంకా 3.04 టీఎంసీలు మిగులు ఉందన్న రాయిపురే.. తెలంగాణ 4.74 టీఎంసీలు అధికంగా వినియోగించుకుందని పేర్కొన్నారు. బోర్డు ఉత్తర్వులేమీ లేకుండానే అధికంగా వాడుకుందన్నారు.