రానున్న రెండ్రోజులు తెలంగాణలో.. మరో మూడ్రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి. నైరుతి గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో శని, ఆది, సోమవారాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా 580కు పైగా ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. శని, ఆదివారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రానున్న ఐదు రోజుల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గుతాయని వెల్లడించారు. ప్రజలంతా ఓ రెండ్రోజుల పాటు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందవచ్చునని అన్నారు. రాష్ట్రంలో గరిష్ఠంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 42.5, నల్గొండ జిల్లా కట్టంగూరులో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.