తెలంగాణ కాస్త చల్లబడింది. ఓవైపు ఎండలు దంచుతూనే.. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. దాదాపుగా రోజంతా ఎండలు దంచికొడుతున్నాయి. కానీ సాయంత్రం కాగానే వర్షం కురుస్తూ.. ప్రజలకు ఉపశమనం కలిగిస్తోంది. అయితే రానున్న ఐదు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ్టి నుంచి 13 వరకు విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించారు. ముఖ్యంగా 12, 13వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఆ తేదీల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మరోవైపు హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చెప్పింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల్లోపు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. దేశ రాజధాని దిల్లీతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.