తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ ఊహించిన దానికంటే విజయవంతం కావడంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ నేతల దృష్టి కొల్లాపూర్ సభపై కేంద్రీకృతమై ఉంది. ఈ సభను తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ సభలోనూ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయన్న నేపథ్యంలో, ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది.
తాజాగా, కొల్లాపూర్ సభ నిర్వహణపై కాంగ్రెస్ నేతలు నేడు మొయినాబాద్ లోని ఓ రిసార్ట్ లో సమావేశమయ్యారు. సీనియర్ నేత మల్లు రవి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, గురునాథ్ రెడ్డి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జులై 20 తర్వాత కొల్లాపూర్ లో కాంగ్రెస్ సభ నిర్వహించనుంది. ఈ సభను భారీ స్థాయిలో నిర్వహించడంపై నేటి సమావేశంలో చర్చించినట్టు సమాచారం.
కాగా, కొల్లాపూర్ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో
కొల్లాపూర్ సభను కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కృతనిశ్చయంతో ఉన్నారు.