తెలంగాణలో గత వారం రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. రెండ్రోజులు కాస్త గ్యాప్ ఇచ్చిన వాన మళ్లీ మంగళవారం ఊపందుకుంది. మంగళవారం సాయంత్రం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్దిపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో వర్షాలతోపాటు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని.. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని వాతావరణశాఖ హెచ్చరించారు.