తెలంగాణలో గత వారం రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు రాష్ట్రంలో ఏకధాటి వాన కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లి వరదంతా ఊళ్లలోకి చేరింది. చాలా చోట్ల రహదారులు చెరువుల్లా మారాయి. ఇక ప్రజలు ఇంట్లో నుంచి బయటకు కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. అయితే గురువారం సాయంత్రం నుంచి వరణుడు కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప.. మరి వర్షాలు లేవని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికి భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని తెలిపారు. తెలంగాణపై నైరుతి రుతు పవనాలు ఉద్ధృతంగా ఉన్నాయని.. తాజాగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద వర్షాలుగా నమోదయ్యాయని చెప్పారు.
ముఖ్యంగా హనుమకొండ సహా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కొన్ని చోట్ల అసాధారణమైన భారీ వర్షాలు కురిశాయని.. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షం కురిసిందని వెల్లడించారు. ఆగస్టు రెండో వారం, సెప్టెంబరులో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.