కొన్ని రోజుల గ్యాప్ ఇచ్చిన వరణుడు మళ్లీ తెలంగాణను వణికిస్తున్నాడు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. గురువారం ఉదయం నుంచి ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఏకధాటి వాన పడింది. అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్-టి మండలంలో 11.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇదే జిల్లా కౌటాలలో 10.1, చింతలమానేపల్లి 6.5, బెజ్జూరు 5.6, ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ 5.2, కరీంనగర్ జిల్లా వి సైదాపూర్ 4.2, ములుగు జిల్లా మంగపేట 4, వరంగల్ జిల్లా పర్వతగిరి 3.9, ములుగు జిల్లా వాజేడులో 3.6 సెం.మీ. వాన పడింది.
బుధవారం రాత్రి కూడా సిద్దిపేట, దుబ్బాక, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, పెద్దపల్లి జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరోవైపు హైదరాబాద్లో గత అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా వాన కురుస్తోంది. అర్ధరాత్రి భారీగా వాన కురవడంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక తెల్లవారుజాము నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి.