సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో నేడు విచారణ

-

సింగరేణి యూనియన్‌ ఎన్నికలపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. యూనియన్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ సింగరేణి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది. ప్రస్తుతం సింగరేణి ఎన్నికల నిర్వహించే పరిస్థితి లేదని, భద్రత కల్పించలేమంటూ కలెక్టర్లు ప్రభుత్వానికి లేఖలు రాసిన నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలంటూ సింగరేణి యాజమాన్యం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై గురువారం రోజున జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టగా… సింగరేణి తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు వినిపించారు. యూనియన్‌లు రహస్య బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయని రామచంద్రరావు కోర్టుకు తెలిపారు. వినాయక నిమజ్జనాలు, మిలాద్‌ ఉన్‌నబీ వంటి పండగలున్నాయని, శాసనసభ ఎన్నికలు సైతం సమీపిస్తుండటంతో సింగరేణి ఎన్నికలు నిర్వహించడానికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అందువల్ల అక్టోబరులోగా ఎన్నికల నిర్వహణకు జూన్‌ 23న ఇచ్చిన గడువును పొడిగించాలని ఉన్నత న్యాయస్థాన్ని కోరారు.

మరోవైపు యూనియన్‌ల తరఫున సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ వాదనలు వినిపిస్తూ గుర్తింపు సంఘం కాలపరిమితి 2019లోనే ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని కోర్టుకు వివరించగా.. కోర్టు సమయం ముగిసిపోవడంతో శుక్రవారం మొదటి కేసుగా విచారణ చేపడతామంటూ న్యాయమూర్తి వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news