తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా గంట గంటకు భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అప్పుడే ఎండ దంచికొడుతోంది.. మరికాసేపటికే అకస్మాత్తుగా వర్షం తడిపేస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడి వానలు పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు.
మరోవైపు గురువారం నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో పూర్తిగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని.. రెండు రోజుల్లో వాయుగుండంగా మారి పశ్చిమబెంగాల్ వైపు ప్రయాణించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా హనుమకొండ జిల్లా వేలేర్ మండలంలో 6.2 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో 5.2, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో 3.8, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో 3.3 సెం.మీటర్ల వర్షం కురిసింది.