తెలంగాణలో వాతావరణం కాస్త చల్లబడింది. నెమ్మదిగా చలి మొదలవుతోంది. ముఖ్యంగా రాత్రి సమయంలో, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఓవైపు చలికి ప్రజలు వణుకుతుంటే.. ఈ సమయంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. అసలే చలికాలం.. ఆపైన వర్షాలతో.. త్వరగా జబ్బుల బారిన పడే అవకాశముందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ తీరంలో ద్రోణి ఏర్పడిందని, తూర్పు దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మంగళవారం పగటి పూట ఉష్ణోగ్రతలు అన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. నల్గొండలో 1.7డిగ్రీలు, హైదరాబాద్‌లో 1 డిగ్రీ సెల్సియస్ తగ్గి 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. నల్గొండ, మెదక్ మినహా అన్ని ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగానే నమోదయ్యాయని చెప్పారు.