తెలంగాణలో ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. కనీసం మార్చి నెల కూడా రాకముందే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరి ఆరంభం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గురువారం నాటికి ఉష్ణోగ్రత దాదాపు 40 డిగ్రీలకు చేరువైంది. రాబోయే నాలుగు రోజుల్లో తీవ్రమైన వేడి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆ తర్వాత 5 నుంచి 6 రోజులపాటు వాతావరణం చల్లబడుతుందని వెల్లడించారు. ఉదయం, రాత్రి వేళల్లో చల్లటి వాతావరణం ఉంటుందని పేర్కొంది.
ఈనెల 10, 11వ తేదీల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 16వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతూ ఉంటాయని వెల్లడించింది. మరోవైపు హైదరాబాద్ లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 నుంచే సూర్యుడు భగభలతో భయపెడుతున్నాడు. ఇక పగటి ఉష్ణోగ్రతలతో నగరవాసులు ఉకిరిబికిరి అవుతున్నారు. ఇప్పుడు ఇంతలా ఎండలు కొడుతుంటే.. ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోనని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.