మొన్నటిదాకా ఉక్కపోతతో ఉతలాకుతలమైపోయిన ప్రజలు ఇక నవంబర్ వచ్చేసిందని కాస్త సేద తీరొచ్చని అనుకుంటున్నారు. కానీ చలికాలం ప్రారంభమైనా.. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గడం లేదు. ప్రజలకు ఉక్కపోతతో తిప్పలు తప్పడం లేదు. గత నెల చివరలో కాస్త చల్లగాలులు వీచినా.. నవంబర్ మొదలైనప్పటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. ముఖ్యంగా ఉక్కపోత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలో శుక్రవారం రోజున చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.. ఖమ్మంలో సాధారణం కన్నా 4.8 డిగ్రీలు అధికంగా 36 డిగ్రీల సెల్సియస్, భద్రాచలంలో 2.7 అధికంగా 34.6, ఆదిలాబాద్ 2.3 అధికంగా 32.8, హనుమకొండ 1.2 డిగ్రీలు అధికంగా 32.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. మూడు రోజుల నుంచి రాత్రిపూట కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. మరోవైపు శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.