తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ ఇటీవలే కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి ప్రక్రియపై రాష్ట్ర రవాణా శాఖ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వివరిస్తూ కేంద్ర రవాణా శాఖకు లేఖ రాసినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్లు ‘టీజీ’తో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అందుకు వారం, పది రోజులు పడుతుందని రవాణాశాఖ వర్గాలు అంటున్నాయి.
‘‘టీఎస్’ నుంచి ‘టీజీ’గా మారే ప్రక్రియ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కే పరిమితం అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రిజిస్టర్ అయిన వాటికి ‘టీఎస్’ కొనసాగుతుందని వెల్లడించాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు రవాణాశాఖ వాహనాలను ‘టీఎస్’తో రిజిస్టర్ చేసిందని.. ఉమ్మడి రాష్ట్రంలో ‘ఏపీ’ కోడ్‌తో రిజిస్టర్ అయిన వాహనాల నంబరు ప్లేట్లు యథాతథంగా కొనసాగుతున్నాయని పేర్కొంది. అలాగే ‘టీజీ’ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పాత వాహనాల నంబరు ప్లేట్లలో ఏపీ, టీఎస్ కోడ్‌లు యథాతథంగా ఉంటాయని ఓ ప్రభుత్వ అధికారి వివరించారు.